వైసీపీ పాలనలో దళితులపై దాడులు,అరాచకాలు పెరిగిపోయాయని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్ సుధాకర్ మొదలు సామాన్యుల వరకు వైసిపి వేధింపులు తాళలేక తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు వస్తున్నా, ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదని తాజాగా మరో ఘటన నిరూపించింది. పోలీసుల వేధింపులు తాళలేక నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. వైసీపీ పాలనలో దళితులు, బడుగుల హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నబాబుది ఆత్మహత్య కాదని, వ్యవస్థ చేసిన హత్య అని విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఏపీ నేరాంధ్రప్రప్రదేశ్ గా మారిపోయిందని దుయ్యబట్టారు. జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలు బలవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపుల వల్లే దళిత యువకుడైన చిన్న బాబులు సూసైడ్ చేసుకోవడం బాధాకరమని అన్నారు.
2020 నవంబర్ లో అబ్దుల్ సలాం కుటుంబం కూడా ఇదే రీతిలో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. అదే పోలీస్ స్టేషన్ లో అధికారుల వేధింపుల వల్ల చినబాబు చనిపోయాడని, ఇది అత్యంత విషాదకరమని అన్నారు. ప్రజలకు, ఆస్తిపాస్తులకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే ఇలా వేధింపులకు గురి చేస్తున్నారని, ప్రజల ప్రాణాలు తీసే స్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని దుయ్యబట్టారు. చిన్నబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.