2024 ఎన్నికలపై ఫోకస్ చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అనే కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో ప్రజలకు చంద్రబాబు వరాల జల్లు కురిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘‘భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథాన్ని’’ చంద్రబాబు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని 5 జోన్లకు 5 బస్సులను పంపారు.
ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పనిచేయని వారికి పార్టీలో స్థానం ఉండదని, పార్టీ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం వద్దని చంద్రబాబు హెచ్చరించారు. పనిచేయని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలని, ప్రత్యామ్నాయ నాయకులను చూసుకుంటామని తేల్చి చెప్పారు. తాను ఇప్పుడు గట్టిగా, కటువుగా మాట్లాడానని అనుకోవద్దని, పార్టీ శ్రేయస్సు కోసం ఇలా మాట్లాడుతున్నానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేందుకు, పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని, టీడీపీ మినీ మేనిఫెస్టోపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని దిశా నిర్దేశం చేశారు. దసరా రోజు విడుదల చేయబోతున్న మేనిఫెస్టోలో బీసీలకు ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని వెల్లడిస్తామని అన్నారు. ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవాలని చంద్రబాబు అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని, దాంతో ఏపీలో ఉండలేమంటూ ఎంపీ ఎంవీవీ తన ఆఫీసును హైదరాబాద్ కు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహించే ముఖ్యమంత్రిని ఏమనాలని ప్రశ్నించారు.
గంజాయి తాగే వెధవలకు తల్లికి చెల్లికి తేడా తెలియదని, అటువంటి వారు రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు. ఏపీలో గన్ చూపించి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఉందని, అవినీతి, అసమర్ధ, నేరస్తుల పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. మచిలీపట్నంలో దళిత యువతికి మత్తుమందు ఇచ్చి వైసీపీ నేత లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ నేతని కాపాడేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరికో పుట్టిన బిడ్డను తనకే పుట్టినట్టుగా చెప్పుకునే వ్యక్తి జగన్ అని, టిడ్కో జగన్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
టీడీపీ ఒరిజినల్ పార్టీ అని, వైసీపీ అతుకుల బొంత అని సెటైర్లు వేశారు. కుప్పంలో వైసీపీ గెలుపు సాధ్యం కాదని, పులివెందులలో వైసీపీని ఓడించి తీరుతామని చంద్రబాబు సవాల్ చేశారు. జగన్ 98 శాతం హామీలు అమలు చేయలేదని, రాష్ట్రాన్ని మాత్రం 98 శాతం లూటీ చేశారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఏపీ మరో నార్త్ కొరియా లాగా మారుతుందని అన్నారు. ఏపీలో భూముల విలువలు తగ్గి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయని, కరెంటు చార్జీల మోత మోగిపోతుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు చార్జిల తగ్గింపునకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు.