వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. గోరంట్ల వీడియో ఒరిజినల్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుడు జిమ్ రిపోర్ట్ ఇచ్చారని టీడీపీ నేతలు ఆధారాలతో సహా వెల్లడించారు. అయితే, ఆ వీడియో ఫేక్ అని చాలాకాలంగా వాదిస్తున్న వైసీపీ నేతలు…తాజాగా జిమ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఫేక్ అని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో చెప్పించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే గోరంట్ల డర్టీ పిక్చర్, ఫోరెన్సిక్ రిపోర్ట్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఛీ..ఛీ…ఆ వీడియోను రాష్ట్రమంతా చూసిందని, ఆ వీడియో ఫేక్ అని ఎవరు చెప్పారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఒరిజినల్ అని కామన్ సెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి చెబుతారని చంద్రబాబు అన్నారు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఒక ఎంపీ ఎంత గౌరవంగా ఉండాలని, ఎంత హుందాగా ఉండాలని, కానీ, ఒక తెలుగు ఎంపీ డర్టీ వీడియో రాష్ట్రంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిందని అన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీ ఒక డర్టీ వీడియోలో అడ్డంగా దొరికిపోయారని, కానీ ఆ ఎంపీపై సీఎం జగన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. గోరంట్ల వ్యవహారం జగన్ కు తెలిసిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.
ఆడవారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో జగన్ ఎందుకు తాత్సారం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు.తమ పార్టీకి చెందిన ఎంపీ తప్పు చేశాడని సిగ్గుతో తలవంచుకోవాల్సిన జగన్ తల ఎత్తుకొని తిరుగుతూ గోరంట్ల మాధవ్ ను సమర్థిస్తారా అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా, గోరంట్ల మాధవ్ గుట్టురట్టు చేసిన టీడీపీ నేతలపై కేసులు పెడతామని బెదిరిస్తారా అని మండిపడ్డారు. నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా అడిగే వారు లేరని జగన్ అనుకుంటున్నారని, తన ఇష్టా రాజ్యంగా రాష్ట్రాన్ని పరిపాలించి అతలాకుతలం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.