ఏపీలో జగన్ ప్రభుత్వం పై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో రాష్ట్రంలోని ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శిస్తున్న వైనం వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇప్పటికే రాయలసీమలోని పలు ప్రాంతాలలో చంద్రబాబు పర్యటనకు అనూహ్యం స్పందన రావడంతో వైసీపీ నేతలు అలజడులు రేపి పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గొడవలకు దిగినా వైసీపీ నేతలలకు టీడీపీ కార్యకర్తలు దీటుగా సమాధానం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లా మల్లవరంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుకే జగన్ దగ్గర నిధులు లేవని, అటువంటిది మూడు రాజధానులు కడతామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానంతోనే సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరించగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతల కమిషన్ల కక్కుర్తి వల్లే ప్రాజెక్టులకు ఈ దుస్థితి పట్టిందని నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని, కానీ మిగిలిన పనులు పూర్తి చేయడానికి జగన్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు.
కాగా, ప్రజా గాయకుడు గద్దర్ హఠాన్మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ మృతి తనను బాధించిందని, తన పాటతో ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిన గద్దర్ ఇక లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు కొనియాడారు. గద్దర్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక, ప్రజా నాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని, తెలంగాణ ఉద్యమ వీరుడు గద్దర్ అని నారా లోకేష్ గద్దర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. గద్దర్ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని, గద్దర్ పాటలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని, అవి చిరకాలం జీవించే ఉంటాయని జగన్ ప్రశంసించారు.