వైసీపీ పాలనపై, పోలీసుల తీరుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గూండాలతో చేతులు కలిపిన కొందరు పోలీసులకు డీజీపీ కూడా వత్తాసు పలుకుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలపై నమోదు చేస్తున్న అక్రమ కేసులపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ ప్రకారం ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చంద్రబాబు తాజాగా లేఖ రాశారు. పుంగనూరులో టీడీపీ నేతలపై పోలీసులు లేదా రెవెన్యూ అధికారులు ఫిర్యాదుదారులుగా ఉంటున్నారని చంద్రబాబు అన్నారు.
ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 307 లేదా ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మాచర్ల, కుప్పం, తంబళ్లపల్లె తదితర ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టుల్లో రిమాండ్ ల తిరస్కరణల ద్వారా ఈ విషయం అర్థమవుతోందన్నారు.
ఓ వర్గం పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని, కొన్ని సందర్భాల్లో పోలీసులు యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్ ధరించకుండానే నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారని విమర్శించారు. ఇలా చేయడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని చెప్పుకొచ్చారు. ఇటువంటి పోలీసు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో అలాంటి పోలీసులను చట్ట ప్రకారం శిక్షిస్తారని చెప్పారు.
ఇక, మిర్చి సాగు చేస్తున్న రైతులు నల్ల తామర పురుగు కారణంగా కష్టాల పాలవుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంతో వరుసగా రెండో ఏడాది కూడా రైతులు నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వం, వ్యవసాయ శాఖ స్పందించాలని డిమాండ్ చేశారు.