ఏపీలో కరోనా మహమ్మారి మరణమృదంగం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 12,634 మంది కరోనాబారిన పడగా….69 మంది మృతి చెందడం కలవరపెడుతోంది. దీంతో, ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 7,685కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 10,33,560 పాజిటివ్ కేసులు నమోదు కాగా…యాక్టివ్ కేసుల సంఖ్య 89,732కి పెరిగింది. ఏపీలో రోజుకు పదివేల పైచిలుకు కేసులు నమోదవుతుండడంతో ఏపీ మరో మహారాష్ట్ర అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, విజయనగరంలోని మహారాజా ప్రభుత్వాసుపత్రిలో అర్ధరాత్రి ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా బాధితులు చనిపోవడం అందరిని కలిచివేస్తోంది. ఆక్సిజన్ అందకనే ఐదుగురు మృతి చెందినట్లుగా వైద్యాధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో కరోనా అల్లకల్లోలం రేపుతోంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందడం కలచివేసిందని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన చంద్రబాబు మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ కొరతను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆక్సిజన్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.