2009లో ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్సార్ వరుసగా రెండోసారి సీఎం అయిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో టీడీపీకి పడాల్సిన ఓట్లను ప్రజారాజ్యం చీల్చిందని, అందుకే టీడీపీ ఓడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2004తో పోలిస్తే వైఎస్ఆర్ కు వచ్చిన సీట్ల సంఖ్య కూడా తక్కువే కావడం ఆ అభిప్రాయాలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలోనే తాజాగా నాటి ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు, మెగాస్టార్ చిరంజీవిపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి పార్టీ పెట్టకుంటే 2009లోనే టీడీపీ అధికారంలోకి వచ్చేదని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని, ఇప్పుడు కూడా తనతో బాగానే ఉంటున్నారని వెల్లడించారు. రాజకీయాల్లో పోరాటం అనేది ఆటలో ఓ భాగం అని చంద్రబాబు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చిరంజీవితో అప్పుడు, ఇప్పుడూ తనకు సత్సంబంధాలున్నాయని చంద్రబాబు అన్నారు.
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ఈ-పేపర్ ‘చైతన్య రథం’ను చంద్రబాబు ఆవిష్కరించారు. టీడీపీ నుంచి వచ్చిన ఈ ఈ-పేపర్.. ప్రజలను చైతన్య పరిచే ఆయుధమని చంద్రబాబు అన్నారు. ప్రజలు వార్తలు చదివే విధానంలో చాలా మార్పులు వచ్చాయని, ప్రజల అభిరుచి ప్రకారమే రీజనల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
రాష్ట్ర భవిష్యత్ బాగుండాలని భావించే ప్రతిఒక్కరూ చైతన్య రధాన్ని చదవాలని సూచించారు. ఇండిపెండెంట్గా వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలపై వేటు వేసేందుకు జగన సర్కార్ శ్రీకారం చుట్టిందని, జగన్ పుట్టకముందు నుంచి ఉన్న దినపత్రికలపై కులముద్ర వేసేందుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసేవారిపై ఎల్లో మీడియా అని ముద్ర వేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.