ఏపీలో జీతాల కోసం జగన్ నానా తిప్పలు పడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, తానే జీతాలు గొప్పగా పెంచానని…చంద్రబాబు హయాంలో అసలు జీతాలు పెంచలేదని జగన్ బల్లగుద్ది మరీ ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో తాను పెంచిన జీతాలు..జగన్ హయాంలో పెంచామని చెబుతున్నారుని ఫైర్ అయ్యారు. జీవో నంబర్ 8, 18 ప్రకారం అంగన్ వాడీ టీచర్ల జీతాన్ని తాను రూ.7 వేల నుంచి రూ.10,500కు పెంచానని గుర్తు చేశారు.
కానీ, జగన్ మాత్రం వారి జీతాన్ని తానే రూ 7 వేల నుంచి రూ.11 500 కు పెంచానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అలా చెప్పుకోవడం సీఎం కుర్చీకి అవమానం అని, జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగస్తులకు మీరేం ంచేశారు..మేమేం చేశాం అన్నదానిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తాము సంపదను సృష్టించామని, ఉద్యోగస్తులను అన్ని విధాలా ఆదుకున్నామని అన్నారు. తప్పుడు వార్తలతో పబ్బం గడుపుకోవాలని చూడొద్దని ఫైర్ అయ్యారు.
ఉద్యోగస్తులను సమర్ధించినందుకు అశోక్ బాబును అరెస్టు చేశారని ఆరోపించారు. 2018లోనే ఆ సర్టిఫికెట్ కేసు క్లోజ్ అయిందని, దీని వల్ల ఆయనకు బెనిఫిట్ రాలేదని కేసు క్లోజ్ చేశారని గుర్తు చేశారు. కానీ, ఉద్యోగులు సమ్మె నోటీసిచ్చిన తర్వాత అశోక్ వారిని సమర్థించినందుకు…ఆయనపై కేసు పెట్టారని ఆరోపించారు. ఎంక్వయిరీ కమిషన్ ఎదుర్కొంటున్న మెహర్ కుమార్ అనే వ్యక్తితో అశోక్ పై కేసు పెట్టించారని ఆరోపించారు.
క్విడ్ ప్రోకోలో జగన్ ఎక్స్ పర్ట్ అని, మెహర్ కుమార్ బంధువుకు పదవి ఇచ్చి…టెక్నికల్ మిస్టేక్ ని పట్టుకొని అశోక్ ను హింసిస్తున్నారని ఆరోపించారు. అదే దారిలో వెళితే వైసీపీ నేతలంతా జైల్లో ఉండాలని, ఇలాంటి మిస్టేక్స్ ను పట్టుకుంటే అసలు జగన్ జైలు నుంచి బయటకు రారని ఫైర్ అయ్యారు.