టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ ప్రకటనతో కలత చెందారు. వర్మకే టికెట్ కేటాయించాలని ఆయన అనుచరులు, కొందరు టీడీపీ కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పిఠాపురం పీటముడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విప్పారు. వర్మను ఉండవల్లి పిలిపించుకున్న చంద్రబాబు…ఆయనను బుజ్జగించారు. ఏ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కు సీటు ఇవ్వాల్సి వచ్చిందో వివరించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
2014 నుండి 2024 వరకు టీడీపీ కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టి ఆ టికెట్ ను ఆయనకు కేటాయించాల్సి వచ్చిందని వివరించారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ జాబితాలో తొలి పేరు వర్మదే ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతోపాటు, క్షత్రియ వర్గానికి చెందిన వర్మకు తగిన గుర్తింపు వచ్చేలా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వర్మను గెలిపించినట్లే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని తెలుగు తమ్ముళ్లకు, వర్మ అనుచరులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇక, చంద్రబాబు ఆశీస్సులతో పిఠాపురంలో పార్టీని చాలా ఏళ్లుగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిలబెట్టానని, ఆయనకు తాను తాలిబన్ వంటి శిష్యుడిని అని వర్మ అన్నారు. చంద్రబాబు మాట శిరోధార్యమని, పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత తనదని వర్మ చెప్పారు. వర్మతో చంద్రబాబు చర్చలు సఫలమైన నేపథ్యంలో పిఠాపురం పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్లయింది.
మరోవైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి….చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వర్మతో చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా పక్కన ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు మాగుంట తనయుడు రాఘవరెడ్డి కూడా టిడిపిలో చేరారు. అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు కృష్ణ చైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తదితరులు తమ అనుచరులతో సహా టిడిపిలో చేరారు. వారందరినీ పార్టీలోకి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.