జగన్ సర్కారులో పోలీసులు ప్రజల కోసం పనిచేయకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు ను ఖండిస్తూ చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
నెలరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగింది. పోలీసులు ఆ కేసును పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ నేతలు దానిపై పోరాడారు. ఆ తర్వాత పోలీసులు ఆ కేసు పై దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులను పట్టుకోమంటే… నిందితులను పట్టుకోమంటూ టీడీపీ చలో పులివెందులకు పిలుపునిచ్చిందని తెలుగుదేశం వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారా? ఇదేం దుర్మార్గ పాలన? దుర్ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా, వారిని పట్టుకోకుండా రాజకీయ పార్టీ నేతలను వేధిస్తారా? ఇది పోలీసు రాజ్యమా? ప్రజాస్వామ్యమా అని చంద్రబాబు నిలదీశారు.
ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయడం సిగ్గు చేటు. పోలీసులకు మతి ఉందా లేదా… ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడతారా? ఏపీలో చట్టబద్ధ పాలన లేదనడానికి ఇదే నిదర్శనం అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
చలో పులివెందుల కార్యక్రమం నిర్వహించడం ద్వారా బాధిత కుటుంబానికి ప్రజల మద్దతు సమీకరించిందుకు బీటెక్ రవి అరెస్టు కక్ష సాధింపా.. బాధితులకు అండగా ఉండటం టీడీపీ నేతలు చేసిన నేరమా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కడప ఎస్పీ ఏం చేస్తున్నారు… నెలరోజుల క్రితం ఎస్సీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో నిందితులు నిర్భీతిగా తిరుగుతుంటే… బాధితులు భూమిపైనే నరకం చూస్తున్నారని చంద్రబాబు వ్యాక్యానించారు. బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.