నిన్న రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. గాంధేయ మార్గంలో చిత్తూరులో ధర్నా చేసేందుకు వచ్చిన చంద్రబాబును పోలీసులు విమానాశ్రయం లాంజ్ లోనే ఆపేశారు. తన ధర్నాకు ఎస్ఈసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని చంద్రబాబు చెప్పినా వినిపించుకోని పోలీసులు….అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు.
దీంతో, దాదాపు 9 గంటల పాటు చంద్రబాబు లాంజ్ లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా చంద్రబాబు…భీష్మ ప్రతిన బూని కూర్చుండిపోయారు. వైసీపీపై చంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని చిత్తూరు జాయింట్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో, చంద్రబాబు అయిష్టంగానే రాత్రి 7.10కి ఉన్న హైదరాబాద్ ఫ్లైయిట్ లో వెనుదిరిగారు. అయితే, చంద్రబాబు కోసం అప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రేణిగుంట విమానాశ్రయం బయట ఎదురుచూస్తున్నారు.
జై చంద్రబాబు…జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ తమ ప్రియతమ నేత కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటికే నీరసించిన చంద్రబాబు….ఓపికనంతా కూడగట్టుకొని తన కోసం అంతసేపు వేచి చూసిన వారందరికీ అభివాదం చేస్తూ…రాబోయే ఎన్నికల్లో విజయం మనదే అంటూ విక్టరీ సింబల్ చూపుతూ ముందుకు సాగారు. ఇక, విమానంలోకి వెళ్లిన తర్వాత చంద్రబాబుతో కలిసి సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు క్యూ కట్టారు.
71 ఏళ్ల వయసులో 9 గంటలపాటు పచ్చి మంచినీళ్లు ముట్టకుండా నిరసన తెలిపిన తర్వాత…ఒంట్లోని సత్తువంతా అయిపోయినప్పటికీ, అభిమానంతో అడిగిన వారితో సెల్ఫీలు దిగేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఎయిర్ హోస్టెస్…వారందరికీ విషయం వివరించి సర్ది చెప్పి కూర్చోబెట్టారు. దీంతో, చంద్రబాబు తన సీట్ లో కూర్చొని సేద తీరారు. ఇలా, ఇంత ఓపిక, సహనం ఉంది కాబట్టే ఇన్నేళ్లుగా కార్యకర్తలను, నేతలను కలగలుపుకొని నిబద్దతతో టీడీపీ జెండాను చంద్రబాబు రెపరెపలాడిస్తున్నారని, జగన్ వంటి నియంతలను కూడా గడగడలాడిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.