సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని ఇక తెగించి పోరాడితేనే అధికారం దక్కుతుందని టీడీపీ నాయకులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధైర్యం నూరిపోస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వీరోచితంగా పోరాడితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయన నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. అలాంటి వారినే పార్టీ ప్రోత్సహిస్తుందని ఈ మాజీ ముఖ్యమంత్రి బాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాలని అలా పోరాడే వాళ్లకే టికెట్లు దక్కుతాయని బాబు చెప్పినట్లు సమాచారం.
2019 ఎన్నికల్లో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న బాబుకు వచ్చే ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి. ఆ ఎన్నికల్లో కానీ పార్టీ మళ్లీ ఓడితే ఇక బాబుకు టీడీపీకి రాజకీయ భవిష్యత్ ఉండదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై విజయం కోసం బాబు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఏపీ ఎమ్మెల్యేలు, శాసన సభ నియోజకవర్గ ఇంఛార్జీలు, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, లోకసభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో బాబు విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు. కుప్పంలోనే తమను ఇబ్బంది పెట్టిన వైసీపీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదని బాబు చెప్పారని తెలిసింది.
వైసీపీ రౌడీయిజాన్ని, దౌర్జన్యాలను, అరాచకాలను ఎదుర్కొని నిలబడాలంటే ఢీ అంటే ఢీ అని తలపడే నాయకత్వం కావాలని బాబు సూచించారని తెలిసింది.
ఇకపై నాయకులంతా స్పీడ్ పెంచాలని బాబు చెప్పినట్లు సమాచారం. పోరాడే ఇష్టం లేనివాళ్లు దండం పెట్టి నియోజకవర్గ ఇంఛార్జీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కొత్త వాళ్లకు అవకాశం వస్తుందని బాబు గట్టిగానే హెచ్చరించారంటా. పని చేయకుండా పదవులు కావాలని పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటే ఉపయోగం ఉండదని హితబోధ చేశారని తెలిసింది. ఇంఛార్జీలంతా ఇకపై వారంలో కనీసం మూడు రోజులు ప్రజల్లో ఉండాలని బాబు ఆదేశించారు.
తాజాగా బాబు వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో విజయాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ చేతిలో టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. చివరకు బాబుకు కంచు కోట అయిన కుప్పంలోనూ మున్సిపల్, పరిషత్ తదితర ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపి పోరాటానికి సిద్ధం చేసేందుకు రెడీ అయిన బాబు ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.