గత కొద్ది రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటించిన ప్రతి ప్రాంతంలోనూ అశేష స్పందన రావడం వైసీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. ‘బాదుడే బాదుడు’పేరుతో బాబు టూర్లు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ సొంత ఇలాకా కడపలో చంద్రబాబు సభకు ఇసకేస్తే రాలనంత జనం రావడంతో జగన్ అండ్ కోకు ఓటమి జ్వరం పట్టుకుంది.
ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబుకు అక్కడి టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ ముద్దులు చూసి అనంత ప్రజలు కూడా మోసపోయారని, కానీ, జగన్ పాలనంతా బాదుడు, గుద్దుడు అని అర్థం చేసుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట అని, 2014లో 14 సీట్లకు గాను 12 సీట్లు గెలిపించారని చెప్పారు.
ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత చూసి కేడర్‌కు కిక్కు ఎక్కిందని…కార్యకర్తలకు ఒక్క అడుగు వేస్తే.. ప్రజలు పది అడుగులు వేస్తున్నారని చెప్పారు. అనంతపురానికి 13వేల కోట్ల పెట్టబడితో కియా పరిశ్రమ వచ్చి 30వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల సెటిల్మెంట్లు, రౌడీయిజానికి భయపడి జిల్లాకు రావాల్సిన జాకీ పరిశ్రమ పారిపోయిందని మండిపడ్డారు.
తన, తన పార్టీ నేతల జేబులు నింపుకోవడానికి జగన్ జె బ్రాండ్స్ మద్యం తీసుకువచ్చారని విమర్శించారు. జగన్ చెప్పిన సుబ్రహ్మణ్యం అన్న.. సవాంగ్ అన్న ఏమయ్యారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని చివరకు కుర్చీలేని పోస్టుకు పంపారని, టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ చివరకు ఏమయ్యారని ప్రశ్నించారు.
కర్నూలులో సోలార్ ప్రాజెక్టుపై విమర్శలు చేసిన జగన్ సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రారంభించి గొప్పలు చెబుతున్నారని చురకలంటించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అనంత ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. దద్దమ్మ సీఎం గంజాయి సరఫరాను అరికట్టకపోవడం వల్లే యువత పెడదోవపడుతున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో జరిగిన భూ కబ్జాలపై టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వా విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
తన జీవితంలో ఇలాంటి ఉత్సాహం చూడలేదని, ఎక్కడ చూసినా కార్యకర్తలేనని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలే పార్టీకి సంపద అన్నారు. ఎన్టీ రామారావుకు అనంతపురం మీద ఎనలేని ప్రేమ ఉండేదని, అందుకే సొంత నియోజకవర్గం గుడివాడను వదిలిపెట్టి హిందూపురం ఎంచుకున్నారని గుర్తు చేశారు. కరువు జిల్లా అనంతపురాన్ని సస్యశ్యామలం చేసేందుకు టీడీపీ హయాంలో ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు.