వివేకా మర్డర్ కేసులో చంద్రబాబు పేరు మొదటి నుంచి వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. మర్డర్ జరిగే నాటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపైనే నాటి ప్రతిపక్ష నేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక, తాజాగా ఈ మర్డర్ వ్యవహారంలో సంచలన వాంగ్మూలాలు బయటకు వస్తున్న సమయంలోనూ మరోసారి చంద్రబాబు పేరునే తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లూ ఈ వ్యవహారంపై సీరియస్ గా విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు…ఈ సారి రూటు మార్చారు.
వివేకా కేసులో జగన్ మరోసారి తన పేరెత్తకుండా జగన్, వైసీపీ నేతలపై సెటైర్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో వివేకా మర్డర్ కేసు, సినిమా టికెట్ల పంచాయతీ, ఉద్యోగుల సమ్మె, చివరకు వాళ్ల ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలకూ తానే కారణమంటున్నారని బాబు పంచ్ లు వేశారు. తనకంత పలుకుబడి ఉంటే ఎన్నికలను మేనేజ్ చేసుకునేవాడినని, ఎందుకు ఓడిపోతానని చురకలంటించారు.
వివేకా మర్డర్ జరిగిన రోజు అవినాశ్ రెడ్డిని అక్కడకు వెళ్లమని తానే చెప్పానని, తర్వాత సాక్షి ఎడిటర్ హోదాలో ‘నారాసురవధ చరిత్ర’ అనే కథనం తానే రాయించానని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి మామ ఆసుపత్రి సిబ్బందితో వివేకా డెడ్ బాడీకి కుట్లు వేయించింది కూడా తానేనని, ఐస్ బాక్సు ఏర్పాటు చేసి, గాయాలు కనబడకుండా పూలు కూడా వేయించానని ఓ రేంజ్ లో ఎద్దేవా చేశారు. ఇక, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, అవినాశ్ రెడ్డి, ఆఖరికి జగన్ రెడ్డి కూడా మన మనిషేనంటూ చంద్రబాబు వేసిన సెటైర్ అన్నింట్లోకి హైలైట్.
బాబాయిని చంపితే ఎంపీ టికెట్ విజయమ్మ, షర్మిలలో ఒకరికి ఇవ్వొచ్చని ఐడియా వేశారని, స్క్రిప్టు అద్భుతంగా రాశారని చురకలంటించారు. ఆ హత్యా నేరాన్ని తనపై మోపితే…సానుభూతితో సీఎం కావొచ్చని స్కెచ్ వేశారని ఆరోపించారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకున్నాడని, అలా చేయడానికి జగన్ కు చాలా ధైర్యం ఉందని, అంత ధైర్యం తనకు లేదని అన్నారు.