భారత్ లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 293 స్థానాలు సాధించిన ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మోడీకి ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూర్చోగా మరోవైపు చంద్రబాబు కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్డీఏ కూటమిలో చంద్రబాబుకు మోడీ ఎంత ప్రాధాన్యతనిచ్చారో, కూటమిలో టీడీపీది ఎంత కీలకమైన పాత్ర అన్నది ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. ఇక, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ చంద్రబాబుతోపాటు పవన్, కూటమికి చెందిన 21మంది నేతలు తీర్మానంపై సంతకాలు చేశారు. మరోవైపు, 17వ లోక్ సభను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రద్దు చేయగా..ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. రాష్ట్రపతిని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు.
ఇక, ఈ నెల 7న మరోసారి ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోడీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.