టీడీపీ-జనసేన అభ్యర్థుల ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత తొలిసారిగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ నాటకాల ముందు సురభి నాటకాలు కూడా బలాదూర్ అని చంద్రబాబు చురకలంటించారు. ఆ నాటకాలతో పేదలను జగన్ మోసం చేస్తున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. పేదల రక్తం తాగేవాడు పేదల ప్రతినిధి ఎలా అవుతాడని ప్రశ్నించారు.
500 కోట్ల రూపాయలతో ప్యాలెస్, ఊరుకో ప్యాలెస్ ఉన్న జగన్ పేదవాడినని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. అల్లాటప్పాగా అభ్యర్థుల ఎంపిక జరగలేదని, ప్రతి నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా ఫోన్లు చేసి ప్రజాభిప్రాయం సేకరించానని చెప్పారు. దాదాపు కోటిన్నర మందికి ఫోన్ చేసి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నానని, ప్రజలే నిర్ణయించుకున్న అభ్యర్థులను ప్రకటించానని చెప్పుకొచ్చారు. ఐవీఆర్ఎస్ వంటి కొత్త విధానాలు అమెరికా వంటి అగ్రరాజ్యాలలో ఉంటాయని, అటువంటిని ఏపీలో అమలు చేయడంలో తాను ముందు ఉంటానని చంద్రబాబు చెప్పారు.
శ్రీకాకుళంలో, ఉత్తరాంధ్రలో భూకబ్జాలు చేస్తున్న సుబ్బారెడ్డిని మంత్రి ధర్మాన విమర్శించిన వ్యవహారంపై కూడా చంద్రబాబు స్పందించారు. తాను ఆ భూములు కొట్టేయలేకపోతున్నానని సదరు మంత్రి బాధ అంటూ చురకలంటించారు. అదే మంత్రి.. ఆ సుబ్బారెడ్డిని పోలీసులకు అప్పజెప్పి జైల్లో పెట్టించి ఉంటే శభాష్ అని అభినందించేవాడిని అని చంద్రబాబు కామెంట్లు చేశారు. జగన్ గ్యాంగ్ బందిపోటు దొంగల కన్నా ఘోరం అని, ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాలిపోతుంటారని, ఎక్కడ గనులుంటే అక్కడ మకాం వేస్తారని సెటైర్లు వేశారు.
ఆ వైసీపీ నేతలను చూస్తుంటే ఉత్తరాంధ్ర మంత్రులకు, స్పీకర్ కు ప్యాంట్లు తడిసిపోతున్నాయని, భయపడి వణికిపోతున్నారని, వీళ్లు నాయకులా అని ప్రశ్నించారు. అందుకే టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేయాలని, ఈ 45 రోజులు ఇరు పార్టీల కార్యకర్తలు కూటమి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి ఎక్కడ సముచిత స్థానం, గౌరవం ఇవ్వాలో తనకు తెలుసని, ఆ బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు.