“జగన్ రెడ్డి మీద రాయి దాడి జరిగింది. నేను ఖండించా. కానీ, నాపై రాళ్లు పడితే మాత్రం ఈ సైకో సంతోషించాడు. రాయి పడితే ఏదో పొరపాటున పడిందని అనుకున్నా.. కానీ, వాస్తవం ఏంటంటే.. బస్సు యాత్రకు జనాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చి తరలించారు. ఆ యువకుడికి కూడా.. బిర్యానీకి డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకువచ్చారు. చివరకు డబ్బులు ఇవ్వలేదు. అందుకే రాయి పుచ్చుకు కొట్టాడని నాకు చెప్పారు“ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పెడనలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో చంద్రబాబు ప్రసంగించారు.
ఐదేళ్లు ప్రజలను దోచుకున్నవాడి దగ్గర డబ్బులు ఉంటాయా? ప్రజల కోసం పోరాటాలు చేసిన వారి వద్ద డబ్బులు ఉంటాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పోగేసుకున్న డబ్బులతోనే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి.. ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నాడని వ్యాఖ్యానించారు. తమ దగ్గర డబ్బులు లేవని.. కేవలం నీతి, నిజాయితీ మాత్రమే ఉందని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రియల్ హీరోగా అభివర్ణించిన చంద్రబాబు.. ఆయనను ఓడించేందుకు డబ్బుల మూటలు తరలిస్తున్నారని విమర్శిం చారు. జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా.. పవన్ గెలుస్తారని.. కూటమిలో జోరు పెరిగిందని వ్యాఖ్యానించారు.
వైసీపీలో నాయకులు నిలబడడం లేదన్న చంద్రబాబు.. ఇప్పటికే 30 మంది నాయకులు బయటకు వచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీలు పదవిలో ఉండగానే పార్టీలో ఉండలేం బాబూ అంటూ.. బయటకు వచ్చేసి టీడీపీలో చేరారని తెలిపారు. గుంటూరు చైర్ పర్సన్.. కూడా పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేశారని చంద్రబాబు అన్నారు. వైసీపీలో ఇక ఎవరూ ఉండరని.. ఈ సైకో జగన్‌ను ఎవరూ భరించలేరని అన్నారు. అందుకే..కూటమిలో తలుపులు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని.. అందరూ వచ్చేయాలని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్‌కు పేరు మారుస్తున్నా!
“సీఎం జగన్మోహన్రెడ్డి అని నేరు ఇప్పటి వరకు పిలిచాను. కానీ, అందరినీ నట్టేట ముంచిన సైకోను ఇక నుంచి అలా పిలవ ను. జగన్ రెడ్డి సైకో! అని పిలుస్తా. నేటి నుంచి అదే పేరుతో నేను పిలుస్తా“ అని చంద్రబాబు అన్నారు.