ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందని, ఓటర్లను బెదిరిస్తూ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆరోపిస్తున్నారు. ఓ వైపు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ…టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాభవం పాలయ్యారని, టీడీపీ కీలక నేతల నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగిరిందని ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని 89 పంచాయతీలకు గాను 79 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారని, కుప్పంలో టీడీపీ కుప్పకూలిందని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాన్ని చంద్రబాబు ఖండించారు. కుప్పంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, వాటి గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు.
కోర్టు ఆదేశాల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను ఎందుకు రికార్డు చేయలేదని ఎస్ఈసీని నిలదీశారు. కుప్పంలో టీడీపీ కాదు ప్రజాస్వామ్యమే ఓడిందని చంద్రబాబు అన్నారు. కుప్పంతో మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉందని, అక్కడి కుటుంబాల్లో తానో సభ్యుడినని అన్నారు. కుప్పంలో కోట్లు గుమ్మరించి, దౌర్జన్యాలకు పాల్పడి గెలిచారని ఆరోపించారు. వలంటీర్లు, అధికారులు సైతం బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులకు పోలింగ్ బూత్ లోపల ఏం పని? అని ప్రశ్నించారు.
కాగా, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ అరెస్ట్‌ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాతీర్పును సహించలేకే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు