ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అధికార ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంలో హద్దులు దాటిపోతున్నారు.
ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభలు, రోడ్ షోల మీద ప్రభుత్వం నిషేధం విధించే పరిస్థితి వచ్చింది. ఈ నిర్ణయం అందరినీ విస్తుబోయేలా చేసింది.
చంద్రబాబు సభల్లో రెండుసార్లు విషాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే ఇంతకుమించి లక్షల మందితో నిర్వహించిన సభలు, సమావేశాల్లో జరగని విషాదాలు ఇప్పుడు, అది కూడా వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు జరగడం అనేక సందేహాలకు తావిస్తోంది.
ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పాల్గొన్న సభల్లో ఇలాంటి ఘోరాలు జరిగాయంటే అందుకు ప్రభుత్వం కూడా కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
సరైన భద్రత, రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వం తప్పే కదా?
గతంలో ప్రతిపక్ష నేతలుగా జగన్, వైఎస్ ఇంతకుమించి పెద్ద స్థాయిలోనే పాదయాత్రలు, సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు.
కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్లకు కావాల్సిన భద్రత ఏర్పాట్లన్నీ పక్కాగా చేశారు.
కానీ ఇప్పుడు ఈ విషాదాల విషయంలో ప్రభుత్వ పెద్దలు, పార్టీ ప్రతినిధులు విపరీతమైన నెగెటివ్ ప్రచారం చేస్తుండడం.. ఇప్పుడు ఏకంగా బహిరంగ సభలు, రోడ్ షోలపై నిషేధం విధించడం రాజకీయ పరిశీలకులకు విస్మయం కలిగిస్తోంది.
ఇది ప్రభుత్వ చేతగాని తనానికి సూచికగా అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
చంద్రబాబు సభలు, రోడ్ షోలకు జనాల నుంచి అద్భుత స్పందన వస్తుండడం చూసి భయపడే జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలకు బలం చేకూరుతోంది.
ఎందుకంటే గుంటూరులో తొక్కిసలాటకు సంబంధించిన విషాదం గురించి వార్త బయటికి వచ్చిన అరగంటలో వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఫొటో షాప్లతో ‘నారాసురుడు’.. ‘నారాక్షసుడు’ అని టైటిళ్లు పెట్టి పోస్టులు దిగిపోయాయి. తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలను కూడా వైసీపీ హ్యాండిల్స్ వైరల్ చేశాయి.
ఈ పరిణామాలు చూస్తే అంతా ప్లానింగ్ ప్రకారం జరిగిందనే టీడీపీ వర్గాల ఆరోపణల్లో నిజం లేకపోలేదనే చర్చ నడుస్తోంది.
రెండు రోజుల పాటు దీని మీద విపరీతమైన రచ్చ చేయడం.. ఇంతలో కొడాలి నాని లాంటి వాళ్లు చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేయడం.. ఆ వెంటనే సభలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. ఇలా అంతా ఒక సీక్వెన్స్ ప్రకారం జరిగిపోయాయి.
తాజా నిర్ణయంతో కుట్ర కోణంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయనడంలో సందేహం లేదు.