టీడీపీ అధినేత చంద్రబాబు.. తన స్వరం మరింత పెంచారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ లక్ష్యంగా ఆయన దూకుడు కొనసాగిస్తు న్నారు. తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. “జగన్ ఫేక్ ఫెలో. ఎక్కడ చదివాడో తెలియదు. ఎక్కడ ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారో చెప్పడు. ఇతనొక ఫేక్ ఫెలో“ అని చంద్రబాబు దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసాంతం సీఎం జగన్ను టార్గెట్ చేసుకుని.. చంద్రబాబు నిప్పులు చెరిగారు.
“వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే నేను ఇక్కడికి వచ్చా. ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుడ్ని చిత్తు చిత్తుగా ఓడించి, ప్యాకప్ చేసి పంపించేయాలి. నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. నేనొక మాట చెప్పా. నా మాదిరిగా రెండు గంటల సేపు ఎండలో నిలుచుని మీటింగ్ లో మాట్లాడు. నీ కథేంటో తేలుతుంది అని చెప్పా. నా చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను చెప్పా… ఎంఏ చదివా, వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివా, 1974లో చదివా, ఆర్థికశాస్త్రం చదివా“ అని చంద్రబాబు అన్నారు.
ఇదే సమయంలో సీఎం జగన్కు కూడా చంద్రబాబు కొన్నిప్రశ్నలు సంధించారు. “ఇప్పుడు నేను అడుగుతున్నా. జగన్ మోహన్ రెడ్డీ నువ్వు ఎక్కడ చదివావు? ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు? మీకు తెలుసా జగన్ ఏ యూనివర్సిటీలో చదివాడో… దాని పేరు `రహస్య` యూనివర్సిటీ! ఇలాంటి ఫేక్ ఫెలోస్ నా గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి ఫేక్ ఫెలో ఈ ఐదేళ్లు ఈ రాష్ట్రాన్నిపాలించాడంటే సిగ్గేస్తోంది“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
“జగన్.. నీ మందీ మార్బలం ఆటలు ఇక సాగవు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇంటికి ఒకరు బయటికి రావాలి, మీ ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలి, ఎన్డీయే అభ్యర్థులు గెలవాలి. ఈ రాష్ట్రం వెలగాలి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి అని మిమ్మల్నం దరినీ కోరుతున్నా“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.