ఏపీలో అసెంబ్లీ సమావేశాల వేడి రాజుకుంది. ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. మొత్తం ఆరు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఏపీ శాసన మండలి బీఏసీలో గందరగోళం ఏర్పడింది. శాసన మండలి ఒక్కరోజు మాత్రమే అని మండలి బీఏసీలో ప్రకటించడంపై టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇందుకు నిరసనగా మండలి బీఏసీ నుంచి కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వాక్ ఔట్ చేశారు. అనంతరం మండలి సమావేశాలు ప్రారంభంకాగానే… వాయిదా తీర్మానాలపై చర్చ జరగాలని టీడీపీ పట్టుబట్టి సభలో నిరసనకు దిగింది. ఎయిడెడ్ విద్యా సంస్థల సమస్యపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. అయితే, వాయిదా తీర్మానాలను చైర్మన్ తిర్కరించారు. ఇందుకు నిరసనగా సభ నుంచి టీడీపీ వాక్ అవుట్ చేసింది. అయితే, అసెంబ్లీ శాససభ సమావేశాల పొడిగింపుపై తమకు సమాచారం లేదంటూ… రెండోసారి మండలి బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇక, అసెంబ్లీలో 27 అంశాలపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. పెట్రో ధరలు తగ్గింపు, రోడ్ల దుస్థితి, మహా పాదయాత్రపై చర్చ, ఎయిడెడ్ విద్యా సంస్థలు, పీఆర్సీ, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలపై చర్చకు పట్టుబడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలంటూ టీడీపీ శాసన సభ్యులు నినాదాలు చేశారు. పెట్రో ధరలపై టీడీపీ వాయిదా తీర్మానాన్నిస్పీకర్ తిరస్కరించారు. దీంతో, టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
అంతకుముందు, నిరసన ప్రదర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చారు. పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. సామాన్యులు ఈ పాలనలో చితికి పోతున్నారని అన్నారు. విద్యుత్ చార్జీలు కూడా ఏపీలో ఎక్కవే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.