అమరావతిలోని ఆర్ 5 జోన్ లో భూములను సీఎం జగన్ పేదలకు పంచుతున్నానని గొప్పగా చెబుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్, వైసీపీ నేతలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ పైరీ డేటు దగ్గరపడ్డ వైసీపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని, వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. వారు భయపడనక్కర్లేదని, వారికి తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని హెచ్చరించారు. తీవ్ర అసహనంలో ఉన్న వైసీపీ నాయకులు తనను తిడతారని, అయితే, వారు ఓడిపోతారని వారికీ తెలుసని చెప్పారు.
కేసులు పెట్టి, రౌడీయిజం చేసి ఓట్లను తారుమారు చేయొచ్చనుకుంటే పొరపాటు అని, ఖబడ్దార్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. తనకు ప్రజల నుంచి సహకారం కావాలని, ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు. తెలుగుజాతిని ప్రపంచపటంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రైతుల త్యాగాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసిన జగన్ పెద్ద దానకర్ణుడిలా పేదలకు ఇళ్ల స్థలాలంటున్నాడని మండిపడ్డారు. రైతుకు కులం, మతం, ప్రాంతం అంటగట్టిన జగన్ ఇపుడు స్థలాలు పంచుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఏపీలో రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందేనని, జగన్ హయాంలో 3 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. జగన్ వచ్చిన తర్వాత ఏపీలో గంజాయి తప్ప మరే పంట సాగు కావడం లేదని విమర్శించారు. వెంటిలేటర్ పై ఉన్న రైతన్నను మళ్లీ నిలబెట్టాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. గతంలో ఏపీ రైతాంగం ఒక ఎకరా అమ్మి హైదరాబాద్ లో 4, 5 ఎకరాలు కొనేవారని, ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితికి కారణం జగన్ అని దుయ్యబట్టారు.