కరోనా కష్టకాలంలో రోగులకు ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా రోగుల దగ్గరికి వెళ్లేందుకు, కరోనాతో చనిపోయిన రోగులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలోనూ తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉంటున్న వైద్యులు, వైద్య సిబ్బంది…కరోనా రోగులకు చేస్తున్న సేవ వెల కట్టలేనిది. అందుకే, కరోనా రోగులకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చేతులెత్తి దండం పెడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రంట్ లైన్ వారియర్స్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.కరోనా వంటి మహమ్మారిని తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని, ఈ పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలకు వెలకట్టలేమని చంద్రబాబు కొనియాడారు. కుటుంబ సభ్యులు కూడా బాధితుల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్న సమయంలో, కరోనా రోగులకు ఫ్రంట్ లైన్ వారియర్స్ చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు…ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు సెల్యూట్ చేశారు.
తన జీవితంలో చాలా విపత్తులను చూశానని, కరోనా వంటి విపత్తును ఎదుర్కోవడం తొలిసారని చంద్రబాబు అన్నారు. విపత్తు సమయాల్లో ఎన్టీఆర్ ట్రస్టు, టీడీపీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు. కరోనా విపత్తులోనూ టెలిమెడిసిన్ ద్వారా సాయం చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ప్రజాసేవ చేసేందుకు ప్రభుత్వానికి మరిన్ని వనరులు అందుబాటులో ఉంటాయని, థర్డ్ వేవ్ కు ప్రభుత్వం సమాయత్తం కావాలని సూచించారు. కరోనాపై పోరులో ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజా సేవ తమ అజెండా అని స్పష్టం చేశారు. నా లైఫ్ లో ఈ పరిస్థితి ఫస్ట్ టైం…బీ అలర్ట్ అని ప్రజలను చంద్రబాబు హెచ్చరించారు.
ఈ సమావేశంలో ప్రముఖ నటుడు, కరోనా విపత్తు సమయంలో రియల్ హీరో సోనూసూద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ సేవలను చంద్రబాబు కొనియాడారు. రియల్ హీరోగా సోనూసూద్ చేసిన సేవలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, ఈ గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని చంద్రబాబు కోరారు.