విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతిని ప్రపంచవ్యాప్తంగా అన్నగారి అభిమానులు ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుముడింపజేసిన ఎన్టీఆర్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్…తెలుగు ప్రజల ఆత్మబంధువు అని చంద్రబాబు కొనియాడారు.
తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి-కీర్తి అన్న ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి ప్రజలకు మంచి చేయాలన్న తపనే సామాన్య రైతుబిడ్డ అయిన తారకరాముడుని మహా నాయకుడిగా తీర్చిదిద్దాయని ప్రశంసించారు. దేశంలో తొలిసారిగా సంక్షేమ పాలనకు టిడిపితో శ్రీకారం చుట్టిన మహానేత ఎన్టీఆర్ అని, పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పిన ఘనత అన్నగారిదని గుర్తు చేశారు.
సంక్షేమం, అభివృద్ధితో పాటు పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేసిన దార్శనికుడు అన్నగారని కొనియాడారు. ప్రజల వద్దకు పాలన కాన్సెప్ట్ ను ప్రజలకు పరిచయం చేసి…సేవ చేసే వాడే పాలకుడు అని దిశా నిర్దేశం చేసిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం….ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తన తాత ఎన్టీఆర్ ఆశయ సాధనే టిడిపి ఎజెండా అని, తన తాత నందమూరి తారక రామారావు గారే తనకు నిత్య స్ఫూర్తి అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అన్నగారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం రాష్ట్రాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని లోకేష్ కొనియాడారు.