టీటీడీలో కౌంటర్ల నిర్వహణను ప్రైవేటు కంపెనీకి జగన్ సర్కార్ దారాదత్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బ్యాంకులు, త్రిలోక్ అనే సంస్థ సంయుక్తంగా ఉచితంగా నిర్వహిస్తోన్న ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.తిరుమలలోని లడ్డూ కౌంటర్లతో పాటు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తులకు టోకెన్లు ఇచ్చేవి, వైకుంఠం క్యూకాంప్లెక్సులో దర్శన టికెట్ల స్కానింగ్, తిరుపతిలోని ఎస్ఎస్ డీ కౌంటర్లు, అలిపిరి టోల్గేట్ వద్దనున్న కౌంటర్లను కేవీఎం ఇన్ఫో(బెంగళూరు) అనే మెన్పవర్ ఏజెన్సీకి అప్పగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వివాదాలకు, వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ గా మారుస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల పవిత్రతను జగన్ దెబ్బతీస్తున్నారని, పవిత్ర పుణ్య క్షేత్రంలో వ్యాపార బీజాలు నాటడమేంటని మండిపడ్డారు. ఇప్పటిదాకా పైసా ఖర్చు లేకుండా సాగిపోతున్న ఉచిత కౌంటర్ల సేవలను కాదని ప్రైవేటు ఏజెన్సీకి ఎదురు చెల్లింపులు చేయడమేంటని ప్రశ్నించారు.
ఈ సేవా కార్యక్రమాల్లో ఎంతో మంది భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని శ్రీవారి ఉచిత దర్శనాన్ని పొందే వీలుండేదని, వారిని తప్పించి లడ్డూ వితరణ, కల్యాణ కట్ట, దర్శన టికెట్ల స్కానింగ్ వంటి సేవలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఎంతవరకు సబబని చంద్రబాబు నిలదీశారు. తిరుమలలోనూ వైసీపీ ప్రభుత్వం కమీషన్లకు కక్తుర్తి పడడం దారుణమని చంద్రబాబు నిప్పులు చెరిగారు.