టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, పోలీసులు వైసీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ దాడులను చూసీచూడనట్లు వదిలేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ నకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది.
టీడీపీ నేతలు, ఆఫీసులపై దాడికి నిరసనగా పలువురు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ దాడులకు నిరసనగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట రేపట్నుంచి 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయాలని సంకల్పించారు.
పార్టీ కీలక నేతలతో సమావేశమైన చంద్రబాబు..ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలో టీడీపీ ప్రతినిధి బృందం…. గవర్నర్‌ను కలిసి దాడులపై వివరణనివ్వనున్నారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కూడా పలువురు టీడీపీ నేతలు కలిసేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న జరిగిన దాడిపై ఇప్పటికే చంద్రబాబు …అమిత్ షాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
దీక్ష పూర్తయిన తర్వాత శనివారం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనవమవుతున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా పరిణామాలపై అమిత్ షాతో చర్చించనున్నారు. టీడీపీ కార్యాలయాలు, నాయకులపై దాడిని అమిత్ షాకు చంద్రబాబు వివరించనున్నట్లు సమాచారం.
మరోవైపు, ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాశారు. పేదరికంలో మగ్గుతున్న వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ మోదీకి చంద్రబాబు లేఖ రాశారు. వేట, అటవీ ఉత్పత్తులు సేకరించడమే వాల్మీకి, బోయల జీవనోపాధి అని, ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని సూచించిందని గుర్తు చేశారు. కర్ణాటకలో కూడా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చారని చెప్పారు.