ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు బాబు నాయుడు భారతదేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా పేరుపొందారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంయుక్తంగా దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రగామిగా నిలిచారు. ఆయన పేరిట రూ. 36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట రూ. 895 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు మొత్తం ఆస్తుల లెక్క రూ. 931 కోట్లు కాగా.. అప్పు రూ.10 కోట్లు ఉంది.
ఆయన తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ఉన్నారు, అతని మొత్తం ఆస్తుల విలువ రూ.332 కోట్లు కాగా.. రూ. 180 కోట్ల అప్పులు ఉన్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్లకు పైగా ఆస్తులతో జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఆయన అప్పులు రూ.23 కోట్లు ఉన్నాయి.
అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తులతో అట్టడుగున నిలిచారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 55 లక్షల ఆస్తులతో జాబితాలో అట్టడుగు నుండి రెండవ స్థానంలో మరియు కేరళ సీఎం పినరయి విజయన్ రూ. 1.18 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన ఆస్తులు రూ. 30 కోట్లకు పైగానే ఉన్నాయి. కాగా, రాష్ట్ర అసెంబ్లీలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఒక ముఖ్యమంత్రి సగటు ఆస్తి రూ. 52.59 కోట్లు అని నివేదిక పేర్కొంది. భారతదేశ తలసరి నికర జాతీయ ఆదాయం 2023-2024 కి సుమారుగా రూ 1.85 కోట్లు. అయితే ముఖ్యమంత్రి సగటు స్వీయ-ఆదాయం రూ 13,64,310. ఇది భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం అధికారంలో ఉన్న 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ. 1,630 కోట్లుగా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
ఇకపోతే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం.. 42 శాతం మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ జాబితాలో ఏకంగా 89 కేసులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి.