రాష్ట్రంలో నకిలీ ఓట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లకు విజ్ఞప్తి చేసినట్టు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్ లో బస చేసిన భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఇతర కమిషనర్లతో ఆయన తాజాగా భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో నకిలీ ఓటు ఒక్కటి ఉన్నా.. దానిని తీసేయాలని ఎన్నికల సంఘానికి విన్నవించినట్టు తెలిపారు. నకిలీ ఓట్ల విషయంలో దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎక్కడికక్కడ దొంగ ఓట్లు నమోదు చేసి దొడ్డిదారిలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల్లో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తోందని అన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ.. దొంగ ఓట్లతో అయినా.. గెలిచేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లకు వివరించినట్టు చంద్రబాబు చెప్పారు. ఏపీలో ఎన్నికలను ప్రజాస్వామ్య యుత వాతావరణంలో నిర్వహించాలని కోరినట్టు తెలిపారు. అవసరమైతే.. కేంద్ర భద్రతా బలగాలను ఇక్కడ మోహరించి.. కేంద్ర ఎన్నికల పరిశీలకులను నియమించి అయినా.. ఎన్నికలను నిర్వహించాలని కోరినట్టు తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించడం సరికాదని తెలిపామన్నారు.
అనుభవజ్ఞులైన అధికారులను మాత్రమే ఎన్నికల విధులకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చంద్రబాబు వివరించారు. బూత్ లెవిల్ ఆఫీసర్లుగా 2600 మంది మహిళా సచివాలయ అధికారులను నియమించారని, వీరికి ఎలాంటి అనుభవం లేదని అన్నారు. ఇక, ఎన్నికలకు ముందు తమ పార్టీ నాయకులపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్న విషయాన్ని కూడా ఎన్నికల సంఘానికి వివరించినట్టు తెలిపారు.