జగన్ పాలనలో రాజకీయ పరిస్థితులు నానాటికీ దిగజారి పోతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు, కుప్పలు తెప్పలుగా చేస్తున్న అప్పులు చూస్తుంటే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలలో టీడీపీతో జట్టు కట్టేందుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో వైసీపీ పాలన, నేతలపై బీజేపీ నేతల విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు…కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి 8 గంటలకు భేటీ అయ్యారు. అమిత్ షా నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాలకు సంబంధించిన కొన్ని విషయాలపై చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో యువగళం పాదయాత్ర, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర…వంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబుకు అమిత్ షా అభయ హస్తం ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ సహకారం ఉంటుందని చెప్పారని తెలుస్తోంది. షా నివాసంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా చంద్రబాబు కలిశారు. అయితే, ఇది ప్రైవేట్ కార్యక్రమం అని ఆ భేటీపై చంద్రబాబు స్పందించారు.