ఈ రోజుల్లో ఫ్రీగా వస్తే చాలు ఫినాయిల్ తాగేందుకైనా చాలామంది సిద్ధపడుతున్నారు. ఇక, ఓటుకు నోటు మొదలు ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల వరకు ఫ్రీగా వస్తే వద్దనేవారు దాదాపుగా ఉండరు. అయితే, వయసు మీరిన వారికి వచ్చే వృద్ధాప్య పింఛనుకు మాత్రం ఇందులో సడలింపు ఉంటుంది. కానీ, ఈ రోజుల్లో కూడా ఓటుకు నోటు తీసుకోకుండా, పింఛను వద్దని తన స్వశక్తినే నమ్ముకుందో పెద్దావిడ. అంతేకాదు, ఓటుకు నోటు తీసుకోనని…పూటకో పార్టీకి ఓటేయబోనని చెబుతున్న ఆ వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే, ఆ వీడియోను చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…ఆ పెద్దవిడపై ప్రశంసలు కురిపిస్తూ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశారు.
‘‘ఓటును అమ్ముకుని బతికే జీవితం కూడా జీవితమేనా? మనం బతికి ఉన్నందువల్లే ఓటు వేస్తున్నాం. చనిపోతే వేయగలమా? అందుకే ఓటు అమ్ముకోకూడదు. కష్టం చేసుకుని తిందాం. కష్టం చేతకానప్పుడు దైవం ఎలా రాసిపెడితే అలానే జరుగుతుంది. నాకు కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. అప్పట్లో మా నాన్న పదిమందికి పెట్టినోడు. ఇప్పుడు నేను పింఛను కోసం వెళ్తే చూసినోళ్లు ఏమనుకుంటారు? ఫలానా వ్యక్తి బిడ్డ పింఛను కోసం వెళ్తుందంటే మా నాన్నకు చెడ్డపేరు వస్తుంది. అందుకే నాకు పింఛను వద్దు. ఓటుకు డబ్బులిచ్చినా తీసుకోను. కానీ ఓటేసి వస్తా. ఈసారి ఒక పార్టీకి, మరోసారి మరో పార్టీకి ఓటు వేయడం నాకు చేతకాదు. తెలుగుదేశం పార్టీకే ఓటు’’ అంటూ ఆ అవ్వ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆమె సందేశాన్ని అందించాలని అనిపించిందని అన్నారు. ఇలాంటి అభ్యుదయ భావాలున్న ఆమె తెలుగుదేశం పార్టీ అభిమాని అయినందుకు గర్వంగా ఉందని, ఆమెకు అభినందనలు అని చంద్రబాబు ట్వీట్ చేస్తూ ఆ వీడియోను షేర్ చేశారు.
ఓటు విలువ గురించి ఈ పెద్దావిడ చెప్పింది విన్నాక, సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆమె ద్వారా ఈ సందేశాన్ని అందజేయాలని అనిపించింది. అమ్మా! నీవంటి అభ్యుదయ ఆలోచనలు కలిగిన మహిళ, తెలుగుదేశం పార్టీ అభిమాని అయినందుకు, పార్టీ అధ్యక్షుడిగా నాకెంతో గర్వంగా ఉంది. మీకు అభినందనలు. pic.twitter.com/ZuYjwn2akE
— N Chandrababu Naidu (@ncbn) February 14, 2022