స్కిల్ స్కాం ఆరోపణలతో రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ స్కాంలో అరెస్టు అయ్యే నాటికి ఆయన బరువు.. తాజాగా ఆయన బరువులో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన వేళ.. ఆయన హెల్త్ బులిటెన్ ను వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. అయితే.. అందులో ఆయన బరువు వివరాల్ని మాత్రం వెల్లడించట్లేదు. ఇదే విషయాన్ని జైళ్ల శాఖ అధికారుల్ని అడిగితే.. మాన్యువల్ ప్రకారం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బరువు వివరాల్ని తీసుకుంటామని.. వాటిని కోర్టుకు సమర్పిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజా ములాఖత్ లో చంద్రబాబుతో భేటీ అయ్యారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. కుమారుడు లోకేశ్ తో పాటు.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. అనంతరం బయటకు వచ్చిన వేళ.. నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. చంద్రబాబు బరువు మీద నెలకొన్న కన్ఫ్యూజన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
శనివారం నాటికి చంద్రబాబును అరెస్టు చేసి 51 రోజులు కావటం తెలిసిందే. నంద్యాలలో ఆయన్ను అరెస్టు చేసే వేళలో చంద్రబాబు బరువు 72 కేజీలు ఉంటే.. ప్రస్తుతం ఆయన బరువు 66 కేజీలకు ఉన్నట్లు చెబుతున్నారు. యాభై రోజుల వ్యవధిలో చంద్రబాబు బరువు ఆరు కేజీలు తగ్గిన వైనాన్ని వెల్లడించిన లోకేశ్.. బాబు బరువుపైనా.. ఆరోగ్యంపైనా తనకు ఆందోళన ఉందన్నారు. చంద్రబాబుకు పుట్టుకతోనే గుండె సమస్య ఉందని.. క్రమశిక్షణతో జాగ్రత్తగా ఆ సమస్యను మేనేజ్ చేస్తున్నట్లుగా చెప్పారు.
తాజాగా లోకేశ్ చెప్పిన మాటలతో.. బాబు బరువుపై ఒక క్లారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు. సెవెన్టీ ప్లస్ వయసులో ఒక్కసారిగా ఇంతలా బరువు తగ్గటం చంద్రబాబు ఆరోగ్యాన్నిదెబ్బ తీయటమే కాదు.. మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోకేశ్ చెప్పినట్లుగా బాబు ఆరు కేజీలు బరువు తగ్గారా? లేదంటే.. వైసీపీ నేతలు కొందరు చెప్పినట్లుగా కేజీ బరువు పెరిగారా? అన్న దానిపై అధికారిక క్లారిటీచాలా అవసరమన్న మాట వినిపిస్తోంది.