తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నాడు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. తెలుగు నేలకు చెందిన నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా స్థానిక పార్టీల సత్తా ఏమిటో చాటి చెప్పిన ఘనత అన్నగారిది. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగోడి సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసిన ఘనత ఎన్టీవోరుదే. ప్రాంతీయ పార్టీలు తలచుకుంటే జాతీయ పార్టీలను మట్టికరిపించగలవని నిరూపించిన పార్టీ టీడీపీ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలా, మార్చి 29, 1982న అన్నగారు స్థాపించిన ఆ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈ ఏడాదికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ ముందు వరుసలో ఉందంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు రూపంలో బలమైన లీడర్…పార్టీ కోసం ప్రాణాలిచ్చే ధృఢమైన కేడర్…వెరసి టీడీపీని దుర్భేద్యం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానంపై చంద్రబాబు ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారని చంద్రబాబు కొనియాడారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని, టీడీపీ 40 వసంతాల వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితమయ్యేలా ఈ వేడుకలండాలని అన్నారు. రాష్ట్రానికి టీడీపీ అవసరం ఏంటో ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
జంగారెడ్డిగూడెం మరణాలను సహజమరణాలుగా చిత్రీకరిస్తున్నారని, ఈ తరహా బాధ్యతలేని ప్రభుత్వాన్ని తాను మునుపెన్నడూ చూడలేదని అన్నారు. మద్యం కల్తీ బ్రాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జగన్ అసమర్థత వల్లే పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. పోలవరంలో మిగతా రూ.40 వేల కోట్లను రాష్ట్రం భరిస్తుందా అని ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ గురించి పూర్తిగా తెలియకుండానే జగన్ మాట్లాడుతున్నారని, అటువంటి జగన్ 2023లో పోలవరం నుంచి నీళ్లు ఎలా ఇస్తారని నిలదీశారు.