తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తిరుగు టపాలో ఇంటికి పంపిస్తారని అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒక్కసీటును కూడా గెలుచుకునే పరిస్థితి లేదని.. అసలు టికెట్లు ఎలా అడుగుతారని.. ఆయన నిలదీశారు. ఇక, వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అభివర్ణించారు.
ఓకే.. చంద్రబాబు చెప్పినవే నిజమని అనుకుంటే.. వైసీపీ స్తానాన్ని భర్తీ చేసే పార్టీ ఏది? అనేది చంద్రబాబు చెప్పాల్సిన అవసరం ఉంది.
నిజానికి అలాంటి పరిస్థితి ఉంటే.. పొత్తుల కోసం.. వెంపర్లాడాల్సిన అవసరం కూడా లేదు.
వాస్తవానికి చంద్రబాబు కుప్పంలో జోష్ పెంచుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో తప్పులేదు. కానీ.. పార్టీలైన్ ఇదేనని కనుక.. ఆయన ప్రజల్లోకి పంపినా.. లేదా, పార్టీ నాయకులు కూడా ఇంకేముంది.. వైసీపీ పని అయిపోయింది.. అని అనుకున్నా పార్టీకి పెను నష్టం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
ఎందుకంటే.. చంద్రబాబే వైసీపీకి సీన్ లేదని చెప్పిన తర్వాత.. పార్టీలో ఇంకెవరూ.. కూడా.. ముందుకు రారు. ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండాలన్న అధినేత మాటను కూడా ఎవరూ పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు.
నిజానికి ఇప్పటికే చాలా మంది నాయకులు చంద్రబాబు మాటను పెడచెవిన పెడుతున్నారు.
ఇక, ఇప్పుడు చంద్రబాబు స్వయంగా వైసీపీ పని అయిపోయిందని.. తుమ్మితే ఊడిపోయే ముక్కు అని.. ప్రజలే తిరస్కరిస్తు న్నారని.. చెబితే.. ఇక తమ విజయం నల్లేరుపై నడేనని.. తమ్ముళ్లు అతిగా ఊహించుకుని.. అసలు నియోజకవర్గంలో తిరగడమే మానేస్తే.. అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అంతేకాదు.. ప్రతి ఒక్కరనీ కలుపుకొని వెళ్లాల్సిన ఈ సమయంలో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా.. పార్టీ నేతల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని .. ఆయన అనుకోవచ్చు.. కానీ.. అలా కాకుండా.. వ్యతిరేక యాంగిల్ కూడా ఉందనే విషయాన్ని గ్రహించాలి.
ఉదాహరణకు వైసీపీని చూస్తే.. పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది.
మరో రెండేళ్లపాటు అధికారంలో ఉండే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ.. జగన్ ఎక్కడికక్కడ నాయకులను ప్రజల్లో తిప్పుతున్నారు. వారిని హెచ్చరిస్తున్నారు.
అయింది కదా.. అధికారంలో ఉన్నాం.. కదా.. ఎక్కడా అతిగా ఆయన ఊహించుకోవడం లేదు.
ఎక్కడికక్కడ.. టీడీపీ, జనసేన లతో మనకు ఎఫెక్ట్ తప్పదనే సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఫలితంగా నాయకుల్లోనూ భయం ఏర్పడింది..
దీంతో నాయకులు ఇష్టమో .. కష్టమో.. ప్రజల మధ్య ఉంటున్నారు. పలితంగా క్షేత్రస్తాయిలో పరిస్థితులు తెలుస్తున్నాయి. దానికి తగిన విధంగా మార్పులు చేసుకుంటున్నారు.
టీడీపీ కూడా ఇదే పంథా అనుసరించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.