ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేయటం రాజకీయాల్లో మామూలే. విపక్ష నేత చంద్రబాబును అధికార వైసీపీకి చెందిన ముఖ్యులు కొందరు కొత్త తరహాలో టార్గెట్ చేస్తున్నారు. విపక్షనేతగా ఉన్న జగన్ ను చంద్రబాబు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని.. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ తరచూ బాబు అండ్ కో చేస్తున్న విమర్శల వేళ.. దానికి చెక్ పెట్టేందుకు ఈ తరహా ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో జగన్ మీద కొత్తగా కేసులు పెట్టింది లేదు. వాస్తవానికి జగన్ మీద కేసులు నమోదు చేసి.. ఆయన్ను జైలుకు పంపినందంతా చంద్రబాబు విపక్షనేతగా ఉన్నప్పుడే. కాంగ్రెస్ పార్టీకి జగన్ కు మధ్యనున్న పంచాయితీ నేపథ్యంలో కేసులు నమోదు కావటం గత చరిత్ర. అయితే.. చంద్రబాబు కేసులు పెట్టించినట్లుగా ప్రచారం చేసే వారు.. అప్పటి కాంగ్రెస్ దన్నుతో అదంతా చేసినట్లుగా ఆరోపిస్తుంటారు.
వారి మాటలు నిజమనే అనుకుంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-2019 మధ్య కాలంలో విపక్ష నేతగా ఉన్న జగన్ మీద కేసులు నమోదు కావటంతో పాటు చర్యలు కూడా ముమ్మరం చేసే వారు కదా? కానీ.. అలాంటిదేమీ జరగలేదన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అంతేకాదు.. విపక్షనేతగా ఉన్న జగన్ ను కేసులతో వేధింపులకు గురి చేయటం సమంజసం కాదని.. తనకు సలహాలు ఇచ్చే వారిని చంద్రబాబు నిరుత్సాహపరిచే వారన్న మాటను వినిపిస్తూ ఉంటుంది.
అందుకు భిన్నంగా జగన్ ప్రభుత్వం మాత్రం.. అధికారంలోకి వచ్చాక శుక్ర.. శనివారాల్లో ఎంతో మంది టీడీపీ నేతలను అరెస్టు చేసిన వైనాల్ని చూస్తే ఒక్క విషయం అర్థమవుతుంది. చంద్రబాబు చేతిలో అధికారం ఉన్న వేళలో.. జగన్ అండ్ కోను వేధింపులకు గురి చేయాలని అనుకొని ఉంటే.. ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నో అరెస్టులు జరిగేవి. జగన్ కు పాదయాత్ర చేసే వెసులుబాటు కూడా వచ్చేది కాదు కదా? అన్న వాదనను వినిపిస్తున్నారు.