టీడీపీ అధినేత చంద్రబాబు.. పొలిటికల్ గ్రాఫ్ పెరిగిందా? ఆయనకు అన్ని వర్గాల్లోనూ మద్దతు పెరిగిందా ? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ సీనియర్లు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే చం ద్రబాబు గ్రాఫ్‌ను పెంచిందని అంటున్నారు. పేద వర్గాలకు ఇప్పుడు జగన్ చేస్తున్న సంక్షేమం కొందరికే అందడం.. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లను ఎత్తేయడం వంటివి ఆయా వర్గాల్లో ఆవేదనకు కారణంగా మారాయి.
ఇక, మధ్య తరగతి వర్గాన్ని పరిశీలిస్తే.. చంద్రబాబు ఉంటే.. అమరావతి పూర్త య్యేదని అంటున్నారు. రియల్ వ్యాపార వర్గాలు కూడా ఇదే భావనతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రియల్ రంగం భారీ కుదుపునకు లోనైంది. దీనికి కారణం .. జగన్ అనుసరిస్తున్న విధానాలేనని ప్రచారంలో ఉంది. మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ప్రకాశం మూడు జిల్లాల్లోనూ రియల్ రంగం కుదేలైంది. దీంతో కీలకమైన నిర్మాణ రంగం భారీగా దెబ్బతిని.. కార్మికులు రోడ్డుపాలయ్యారు. ఈ పరిణామం కూడా బాబుకు అనుకూలంగా మారిందని చెబుతున్నారు టీడీపీ సీనియర్లు.
ఇక, ఉభయగోదావరి జిల్లాలను పరిశీలిస్తే.. కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై ఇక్కడి రైతులుఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరితో వారు విసిగిపోతున్నారు. చంద్రబాబు ఉండి ఉంటే.. పోలవరం ఈ పాటికి పూర్తయ్యేదని రైతులు అంటున్నారు. పైగా జగన్ అవలంభిస్తున్న వైఖరితో పోలవ రం నీటి మట్టం తగ్గిపోయే ప్రమాదం ఉందని సంకేతాలు అందుతుండడంతో అనవసరంగా గెలిపించా మనే భావన వీరిలో వ్యక్తమవుతోంది.
ఇక, జగన్‌కు 22 మంది ఎంపీలు ఉన్నా.. ఏమీ సాధించలేక పోతున్నా రని.. ప్రతి విషయంలోనూ కేంద్రానికి సాగిలపడుతున్నట్టు కనిపిస్తోందని ఉన్నతస్థాయి వర్గాల ప్రజలు అబిప్రాయపడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. కేంద్రంతో పోరాడైనా.. సాధించేవారని.. వారు అంటున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. పైగా జగన్ తనపై ఉన్న కేసుల విషయంలో రాజీ పడుతున్నారని బాబుకు ఇందుకు సాగిలపడాల్సిన అవసరం లేదని అందుకే ఆయన దూకుడుగానే వ్యవహరించారని చెబుతున్నారు.
ఇలా అటు పేదలు, ఇటు మధ్యతరగతి వర్గాలు మరోవైపు ఉన్నతస్థాయి వర్గాల్లోనూ జగన్‌పై ఉన్న సానుకూలత తగ్గడంతోపాటు.. చంద్రబాబుపై నమ్మకం, విశ్వాసం పెరుగుతోందని అంటున్నారు టీడీపీ సీనియర్లు. మరి ఇదివచ్చే ఎన్నికల వరకు ఉంటుందా? చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా? చూడాలి.