టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ ఈ రోజుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజుల పాటు ఆయన రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. దాంతోపాటు 2 రోజులపాటు జైల్లోనే చంద్రబాబును సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును వర్చువల్ పద్ధతిలో పోలీసులు హాజరు పరిచారు.
ఈ సందర్భంగా కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాన్ని జడ్జి కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనను మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని, తన హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ వయసులో తనకు పనిష్మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు లేకుండా అరెస్ట్ చేశారని, విచారణ చేసి తప్పు నిరూపించలేదని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని, చట్టాన్ని తాను గౌరవిస్తానని చంద్రబాబు చెప్పారు. కానీ, తనపై ఉన్నవి నిరాధార ఆరోపణలని చంద్రబాబు అన్నారు.
45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఏపీ, తెలంగాణలో తన పాలన గురించి అందరికీ తెలుసని చంద్రబాబు అన్నారు. తనపై కక్ష సాధించేందుకు ఈ కేసులు పెట్టారని ఆరోపించారు.
అయితే, చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నారని, పోలీస్ కస్టడీలో లేరని న్యాయమూర్తి చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, నేరం రుజువుకాలేదని అన్నారు. జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జడ్జి చెప్పారు.