తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండడంతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా తిరుపతిలో మకాం వేసిన చంద్రబాబు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రెండేళ్ల జగన్ పాలనను ఎండగడుతూనే టీడీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు చంద్రబాబు వివరించారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు….జగన్ పై నిప్పులు చెరిగారు.
గత రెండేళ్లలో జగన్ వైఫల్యాల చిట్టాను మీడియా ముందు పెట్టిన చంద్రబాబు….జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కు కళ్లు నెత్తికెక్కాయని.. జగన్ కు మదమా.. కొవ్వా అర్థం కావడం లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు మనుషులేనా… ఇదేనా పాలన? అని అసహనం వ్యక్తం చేశారు. జగన్ పాలన వైఫల్యాలమయమని, జగన్ మొద్దు నిద్రపోతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనని, ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఈ నెలకు జీతాలు, పెన్షన్లు ఇస్తే చాలు అనేలా ఖజానా పరిస్థితి ఉందని, వచ్చే నెల ఏమవుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొందని దుయ్యబట్టారు. కుక్కలు చింపిన విస్తరిలా పాలన మారిందని, అందినకాడికి అప్పులు చేస్తున్నారని, ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేదని, సీపీఎస్ అతీగతీ లేదని, పీఆర్సీ వ్యవహారం కమిటీ వరకే ఆగిపోయిందని విమర్శించారు.
పాలనానుభవం లేని జగన్.. కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని, ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడని నిప్పులు చెరిగారు. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగాయని, ఇప్పటి వరకు ఆ దాడులు చేసిందెవరో కనిపెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ జరగని ఘటనలు.. ఈ రెండేళ్ల జగన్ పాలనలో జరిగాయని దుయ్యబట్టారు.
రామతీర్థం ఘటనపై హక్కుగా, బాధ్యతగా వెళితే… తనపై తప్పుడు కేసులు పెట్టారని, తిరుపతిలో రాళ్లు వేయించి తననే సాక్ష్యం ఇమ్మంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దొంగతనం జరిగితే మనమే దొంగల్ని పట్టుకోవాలా..అని ప్రశ్నించారు. మీడియా సమక్షంలోనే రాళ్లదాడి జరిగిందని, పోలీసులు విచారణ జరిపితే దాడి జరిపిందెవరో తెలుసుకోవడం కష్టం కాదని అన్నారు.
ఏపీకి స్పెషల్ స్టేటస్ తేలేని జగన్…స్పెషల్ స్టేటస్ అంటూ నాసిరకం మద్యంతో జనం ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ అరాచక పాలనను జగన్ ఆనందిస్తున్నాడు తప్ప… తప్పులను సరి చేసుకోవడం లేదని, తిరుపతి ఉప ఎన్నికలో జగన్ కు ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.