టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాల నుంచి స్వదేశానికి వచ్చీ రావడంతోనే పనిప్రారంభించారు. వైసీపీ నేతల విమర్శలను బలం గా తిప్పికొట్టాలని పార్టీ కీలక నాయకులకు ఆయన సూచించారు. ఈ నెల 13న ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత.. ఆయన విదేశాలకు కుటుంబ సమేతంగా వెళ్లిన విషయం తెలిసిందే. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు.. ఆ వెంటనే టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు చెందిన ఇంచార్జ్‌లు, అభ్యర్థులతో ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా కీలక విషయాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పోస్టల్ బ్యాలెట్లో తాము ఓడిపోతామనే ఉద్దేశంతో వైసీపీ హంగామా చేస్తోందని.. ఎన్నికల సంఘాన్ని కూడా విమర్శిస్తోందని.. ఈ విమర్శలను తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపుని చ్చారు. అదేవిధంగా కౌంటింగ్ రోజు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏజెంట్లను ఎంపిక చేసుకోవడం నుంచి కౌంటింగ్ ప్రక్రియను నిశితంగా గమనించే వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో పార్లమెంటు నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని సూచించారు.
అటు కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టడంతోపాటు.. జూన్ 1న కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి ఒటూ అత్యంత విలువైనదేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు, అంచనాల నేపథ్యంలో కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఓట్లు పార్టీకి కీలకమని తెలిపారు. ఉద్యోగ వర్గాలు అన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయని.. అందుకే వైసీపీ నేతలు పోస్టల్ బ్యాలెట్‌ను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని.. వీటిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు.