ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి 175 స్థానాలకు గాను 164 స్థానాలను కైవసం చేసుకొని కనీవినీ ఎరుగని రీతిలో విజయ దుందుభి మోగించింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలకు గాను 135 అసెంబ్లీ స్థానాలు..16 లోక్ సభ స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఈ క్రమంలోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించనుంది.
ఈ క్రమంలోనే చంద్రబాబుపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. కింగ్ మేకర్ చంద్రబాబు అని, ప్రతిపక్ష నేతగా ఏపీ అసెంబ్లీలో అవమానాలు, ర్యాగింగ్ ఎదుర్కొన్న చంద్రబాబు అకుంటిత దీక్షతో నేడు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా చంద్రబాబుపై పొగడ్తలు కురిపిస్తున్నాయి.
వాస్తవానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదామని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుకున్నారు. కానీ, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గట్టిపోటీ ఇచ్చి ఓటమిపాలుకాగా, లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవకుండా ఘోరపరాజయం పాలైంది. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణలో బలపడి అధికారం చేపట్టిన కాంగ్రెస్, రోజురోజుకూ బలపడుతూ అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీల దెబ్బకు బీఆర్ఎస్ అస్థిత్వ పోరాటం చేస్తోంది. దీంతో, కేసీఆర్ చెప్పి చేయలేకపోయినది, చంద్రబాబు సైలెంట్ గా చేసి చూపించారని ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రబాబు వంటి విజనరీ లీడర్ కు ఉన్న క్రేజ్ అది అని తెలుగు తమ్ముళ్లు కొనియాడుతున్నారు.