కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. నెల్లరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. అయినప్పటికీ వరద సాయంలో, బాధితులను, రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరదసాయం అందించడంలో ప్రభుత్వ వైఫల్యంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ రాశారు. వరద సాయం, వరద బాధితులను ఆదుకోవడం, నష్టం అంచనాలో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అంచనా ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని, కానీ, ఇప్పటివరకు కేవలం రూ.35 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశారని లేఖలో చంద్రబాబు పేర్కొంటూ అసహనం వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన నిధులను జగన్ సర్కార్ దారి మళ్లించడాన్ని కాగ్ తప్పుబట్టిందని చంద్రబాబు….సీఎస్ దృష్టికి తెచ్చారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల వరదబాధితులను ఆదుకోవాలని కోరారు. వరదల తీవ్రతకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, రైతుల వేలాది ఎకరాల పంట నీటిపాలైందని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లోని నిరాశ్రయులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాల్సి ఉందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సాయం అందించాలని చంద్రబాబు కోరారు. ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు, పంట నష్ట పరిహారాన్ని పెంచాలని చంద్రబాబు కోరారు.