ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తారీకున భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. మోడీ అధ్యక్షతన జరిగిన జరిగిన ఈ సమావేశానికి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్డీఏ మిత్రపక్ష పార్టీల అధినేతలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, ఎంపీలు బలపరిచారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత మూడు నెలలుగా ఎన్డీఏను అధికారంలోకి తెచ్చేందుకు మోడీ ఎన్నికల ప్రచారంలో తలమనకలయ్యారని, క్షణం తీరిక లేకుండా గడిపారని చంద్రబాబు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో 3 బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించామని గుర్తు చేశారు. ఏపీలో మోడీ సభలతోపాటు, అమిత్ షా సభతో ఎన్నికల స్వరూపం మారిపోయిందని ప్రశంసించారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీ రావడానికి మోడీ, షాల ప్రచారం ఎంతగానో దోహద పడిందన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.
నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి నేతలు ప్రచారానికి రావడంతో ఏపీ ప్రజల్లో ఎన్డీఏ కూటమిపై విశ్వాసం పెరిగిందని చెప్పారు. మోడీ నేతృత్వంలోని భారత్ గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని చంద్రబాబు ప్రశంసించారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపడంలో మోడీ కీలకపాత్ర వహించారని అన్నారు. వికసిత్ భారత్, ప్లాన్ 2047 పై మోడీ ప్రణాళికలు రూపొందించారని, వాటిని చేరుకుంటామన్న విశ్వాసం ఎన్డీఏ మిత్రపక్షాలకు ఉందని అన్నారు.
https://x.com/i/status/1798985223797150201