ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ఫైర్ అయ్యారు. ఈ సారి మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులోని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ఇటీవల ఏపీ హైకోర్టును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని ప్రభుత్వం తన శత్రువులు, ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా అమరావతి భూస్కామ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని కోర్టు న్యాయం చేయాల్సింది పోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
ఓ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మరో హై కోర్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అన్ని వర్గాల నుంచి విస్మయం వ్యక్తమైంది. ఆయన వ్యాఖ్యలపై హైకోర్టు కూడా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. లైమ్‌లైట్‌లో ఉండాలని భావిస్తున్న వారి లైట్స్ ఆపేస్తామని హై కోర్టు తీవ్రంగా స్పందించింది.
మరోవైపు కొంతమంది రాజకీయ నాయకులు కూడా జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను తప్పు పట్టారు. తాజాగా చంద్రబాబు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
“ఒక జడ్జి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా? రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారు. ఏపీలో ఆత్మహత్యలు అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనిపించడం లేదా? ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్లు సపోర్ట్ చేయవచ్చా? రిటైర్ అయిన తర్వాత వీళ్లకు పదవులు కావాలి కదా అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకాయన సుప్రీం కోర్టు జడ్జీగా పనిచేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి దక్కడంతో జగన్‌ను పొగుడుతున్నారు” అని బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని బాబు ప్రశ్నించారు. బాబు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం టీడీపీ నేతలకే ఆశ్చర్యాన్ని కలిగించిందని టాక్.