మాజీ మంత్రి దేవినేని ఉమ అక్రమ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల అక్రమ మైనింగ్ ను పరిశీలించారన్న కారణంతో ఉమపై దాడి చేయడమే కాకుండా, ఆయనపైనే కేసు బనాయించి రిమాండ్ కు తరలించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేవినేని ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడ వచ్చారు.
ఈ సందర్భంగా విజయవాడలో ఉన్న గొల్లపూడిలోని ఉమ నివాసం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. ఉమను విడుదల చేయాలంటూ, జగన్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మరోవైపు, చంద్రబాబును కలిసేందుకు వైసీపీ దళిత సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే గొల్లపుడిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గొల్లపూడి 1 సెంటర్లలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దేవినేని ఉమ నివాసానికి చేరుకున్న చంద్రబాబు….ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉమ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
మరోవైపు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కొండపల్లి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఆనంద బాబును ఇంటి గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఆనందబాబును అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.