ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న హఠాన్మరణం టాలీవుడ్ తో పాటు టీడీపీ శ్రేణులను విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే . తారకరత్న హఠాత్తుగా గుండెపోటుకు గురి కావడం, ఆ తర్వాత 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడవడం నందమూరి అభిమానుల, టిడిపి కార్యకర్తలను శోక సంద్రంలో ముంచెత్తింది. ఈ క్రమంలోనే తాజాగా తారకరత్న పెద్దకర్మ కార్యక్రమాన్ని నేడు హైదరాబాదులో నిర్వహించారు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు
ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని చంద్రబాబు పరామర్శించారు. తారకరత్న కూతురి పక్కన కూర్చుని ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పక్కన కూర్చున్న విజయసాయిరెడ్డి…ఆయనతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఆ తర్వాత బాలకృష్ణ, చంద్రబాబుతో విజయసారెడ్డి కరచాలనం చేయడం కనిపించింది.
ఇక, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి హాజరై తారకరత్నకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తారకరత్నకు నివాళులర్పిస్తూ జూ.ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న చిత్రపటం ముందు తలవంచిన తారక్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ, మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి, సీనియర్ పొలిటిషియన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కళాబంధు టి సుబ్బరామిరెడ్డి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దర్శకులు గోపీచంద్ మలినేని, వైవిఎస్ చౌదరి, రవిబాబు, సినీ హీరో రాజశేఖర్, నిర్మాత జీవితా రాజశేఖర్ తదితరులు, నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అలేఖ్య రెడ్డి తరఫు బంధువులు, తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.