జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని, జగన్ హయాంలో సామాన్యులు అప్పులపాలవుతున్నారని కంతేరుకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ మీడియా ముందు బహిరంగంగా వెల్లడించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించిన వెంకాయమ్మ…మళ్లీ ఎన్నికలలో టీడీపీదే విజయమని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇలా జగన్ అండ్ కో పరువు తీయడంతో వెంకాయమ్మ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమెను బెదిరించడం కలకలం రేపింది.
అయితే, ఆ దాడి ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు ఖండించారు. జగన్ కు, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి ఫోబియా పట్టుకుందని, అందుకే ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ దుకాణం సర్దుకోవాలని, ఆకురౌడీలకి ఎవ్వరూ భయపడరని, వెంకాయమ్మలాగా ప్రశ్నించే వారికి టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ భరోసానిచ్చారు. ఈ క్రమంలోనే వెంకాయమ్మను ఇటీవల ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడుకు కూడా ఆహ్వానించారు.
అయితే, తీరు మారని వైసీపీ నేతలు….తాజాగా వెంకాయమ్మ కుమారుడిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే వెంకాయమ్మ కుటుంబంపై, ఆమె కుమారుడిపై దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వెంకాయమ్మకు చంద్రబాబు పోన్ చేసి పరామర్శించారు. వైసీపీ నేతల దాడి ఘటన నేపథ్యంలో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు…వెంకాయమ్మకు పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు.
జగన్ పాలనపై విమర్శలు చేస్తే దాడులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అరాచక శక్తులు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు జగన్ కు బానిసలు అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. వెంకాయమ్మ కుటుంబంపై, ఆమె కుమారుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.