వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై దాడులు పెరిగిపోయాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జగన్ కక్షా రాజకీయాలకు తెర తీశారని, టార్గెట్ చేసి మరీ దాడులను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో కొద్ది రోజుల క్రితం టీడీపీ నే చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
ఆ దాడిలో చెన్నుపాటి గాంధీ కుడి కన్నుకు తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నుపాటి గాంధీని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు…. గాంధీకి తాను అండగా ఉంటానని, పార్టీ మద్దతు ఉంటుందని ఆయన వెన్నుతట్టి భరోసానిచ్చారు. అంతేకాదు, చెన్నుపాటి గాంధీ కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.
విజయవాడలో చెన్నుపాటి గాంధీపై వైసీపీ రౌడీలు దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ రౌడీలు గాంధీ కంటిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం ఘోరం అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలపై జరుగుతున్న ప్రతి దాడి వెనుక జగన్ రెడ్డి ఉన్నాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ దాడి వెనుక పోలీసులు కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
ఇది ఎమోషనల్ గా జరిగిన దాడి అంటూ పోలీసులు అనడం ఆ ఆరోపణలకు ఊతమిస్తోందని చెప్పారు. పోలీసులు అలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించిన చంద్రబాబు… ఏం… మా వాళ్లకు లేవా ఎమోషన్స్? అంటూ మండిపడ్డారు. గాంధీపై దాడి చేసిన దోషులకు శిక్ష పడేంతవరకు వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
“హత్యా రాజకీయాలకు పాల్పడుతుంటే చూస్తూ కూర్చోవాలా? ఓడిపోతామన్న భయంతో వైసీపీ రౌడీలు చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా రోడ్లపై తిరగలేని రోజు వస్తుంది… జాగ్రత్త” అంటూ జగన్ కు చంద్రబాబు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.