గత ఏడాది జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన నర్సీంపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ (52) గుండెపోటుతో మృతి చెందారు. గత ఏడాది కరోనా రోగులకు సేవలదించిన సుధాకర్…ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని ప్రభుత్వాన్ని విమర్శించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సుధాకర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
సుధాకర్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సుధాకర్‌ది ప్రభుత్వ హత్యేనని, జగన్ అనుసరిస్తున్న ఎస్సీ వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు సుధాకర్ బలయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. సుధాకర్ ను శారీరకంగా, మానసికంగా జగన్ ప్రభుత్వం వేధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు, సుధాకర్ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరమా అని ప్రశ్నించారు. సామాన్య వైద్యుడిని వెంటాడి, వేధించి చివరకు ఇలా అంతమొందించారని లోకేశ్ విమర్శించారు. సుధాకర్ ది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అని అన్నారు. నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పించిన లోకేశ్… ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అంతకుముందు, ప్రభుత్వంపై విమర్శల అనంతరం సుధాకర్‌ను ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నడిరోడ్డుపై సుధాకర్ ను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సుధాకర్ మానసిక స్థితి బాగోలేదన్న నెపంతో విశాఖపట్నంలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. దీంతో సుధాకర్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం కలకం రేపింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా జరిగింది. కోర్టు తీర్పు మరి కొద్ది రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో సుధాకర్ మరణించడం శోచనీయం.