టిడిపి సీనియర్ నేత, ఉత్తరాంధ్రలో టిడిపి కీలక నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఈరోజు తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు హఠాత్తుగా ఆయనను, ఆయన తనయుడు రాజేష్ ను అరెస్టు చేశారు. విశాఖలో సిఐడి కార్యాలయానికి వారిని తరలించిన పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ అరెస్టును టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ ఒక రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న కుటుంబాన్ని ముందు నుంచి జగన్ వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో వైసిపి దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అయ్యన్న భార్య పద్మావతికి చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అయ్యన్నకు, అయ్యన్న కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసానిచ్చారు.
జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న, రాజేశ్‌లను సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది బీసీలపై దాడి తప్ప మరోటి కాదన్నారు. జగన్ మార్కు దురాగతాలు, ఫాసిస్టు పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. 1947కు ముందు స్వాతంత్ర సమరయోధులతో జైళ్లు నిండేవని, ఇపుడు జగన్ పాలనలో టీడీపీ నేతలతో నిండుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.
ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని టీడీపీ మరో నేత ఆలపాటి రాజా అన్నారు. అర్ధరాత్రి వేళ గోడదూకి ఇంటికి వచ్చి అయ్యన్నను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జగన్ శాడిజానికి ఇది నిదర్శమని అన్నారు. సీఐడీ పోలీసులు జగన్ ప్రైవేటు సైన్యంలా మారారని అన్నారు. తాను జైలు పక్షిని కావడంతో అందరినీ జైలుకు పంపాలని జగన్ చూస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.