సీఎం జగన్ హయాంలో ఆయన అండ చూసుకొని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ అండ చూసుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అమాయక ప్రజలపై కొందరు వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా కుప్పంలో భోజనం అయిపోయిందని చెప్పిన పాపానికి..ఓ హోటల్ పై వైసీపీ నేతలు దాడి చేసి అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపింది.
ఈ క్రమంలోనే ఆ ఘటనపై టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. భోజనం అయిపోయిందన్న పాపానికి హోటల్‌పై వైసిపి కౌన్సిలర్లు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. కుప్పంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైసీపీ తెచ్చిందని దుయ్యబట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి, మహిళలను బెదిరించడం.. హోటల్ నిర్వాహకులను చంపేస్తాం, హోటల్ తగలబెట్టేస్తాం అంటున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ బెదిరించిన వారిపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోలని, కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాలని అన్నారు. ఆ బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
కాగా, టీడీపీ వార్షిక పండుగ మహానాడును ఈ ఏడాది ఒంగోలులో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఒంగోలు మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహణకు అనుమతినివ్వాలని కోరగా..ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో అందుకు నిరాకరించింది. అవసరమైన ఫీజు చెల్లించి, ముందుగానే సంప్రదించినా కూడా అధికారులు స్టేడియాన్ని కేటాయించేందుకు ససేమిరా అన్నారు. దీంతో, ఈ వ్యవహారంపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేదిక విషయంలో ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో నిరాశ చెందవద్దని, టీడీపీ భవిష్యత్ కార్యచరణ చాటిచెప్పేలా మహానాడు వేదికనుంచి సమరశంఖం పూరించాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఒంగోలు సమీపంలోని మండవారిపాలెంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను శరవేగంగా చేపట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
మరోవైపు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఈ ఏడాది పొడువునా ఘనంగా నిర్వహించనున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని, ఆయన స్వస్థలం నిమ్మకూరులో శతజయంతి వేడుకలను నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గుంటూరు, తెనాలిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా బాలయ్య హాజరవుతారు.
కుప్పంలో హోటల్ పై వైసిపి కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్ పై వైసిపి ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం.(1/2) pic.twitter.com/mfdFBuPu02
— N Chandrababu Naidu (@ncbn) May 16, 2022