ఏబీఎస్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు నిర్వహిస్తుండగా ఆర్కే తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ అధికారులు జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. సోదాలు నిర్వహించిన 24 గంటల తర్వాత ఆర్కేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్, ఏపీ సీఐడీ అధికారులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ఠ అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారి గొంతులను అణచివేయడమే జగన్ లక్ష్యమని మండిపడ్డారు. సోదాలు జరిగిన 30 గంటల తర్వాత రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు ఎన్ని రోజులు సంకెళ్లు వేస్తారని ప్రశ్నించారు.
తన అవినీతి బురదను అందరికీ అంటించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని, లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లడమే ఆర్కే చేసిన నేరమా? అని ప్రశ్నించారు. సీఐడీ అధికారుల సమక్షంలోనే లక్ష్మీనారాయణతో రాధాకృష్ణ మాట్లాడారని, దానికే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని మండిపడ్డారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలు చెప్పినట్టుగా సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నార, సీఐడీ వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో మీడియా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరిగినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.